మహానటి సావిత్రి మరణంతో యావత్ తెలుగు ప్రజానీకం ఎలాగైతే దుఃఖ సాగరంలో మునిగిపోయిందో, ఒక వ్యాంప్ ఆర్టిస్ట్, శృంగార గీతాలతో ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా అలాగే శోక సముద్రంలో మునగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాన్ని బట్టి స్మితను జనం ఎంతగా ఆరాధించారో అర్థం చేసుకోవచ్చు. 1996 సెప్టెంబర్‌లో మద్రాస్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది స్మిత. ఇప్పటికీ జనం ఆమెను మరవలేదు.
స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఏలూరు సమీపంలోని ఓ గ్రామంలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు శ్రీరామమూర్తి, నరసమ్మ. అయితే ఏలూరుకు చెందిన అన్నపూర్ణమ్మ అనే పిల్లలులేని సమీప బంధువు విజయలక్ష్మిని దత్తత తీసుకుంది. స్కూల్లో చదువుకొనే రోజుల నుంచే విజయకు సినిమాలంటే పిచ్చి. అది అన్నపూర్ణమ్మ గుర్తించింది. చక్కని శరీర సౌష్టవం, మత్తు కళ్లతో మగాళ్లను చిత్తుచేసేట్లు ఉండే ఆమెను సినిమా ఫీల్డుకు తీసుకెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. సినిమాల్లో నటిస్తే బాగా డబ్బు సంపాదించవచ్చని ఆమె వినివుంది.
అయితే అన్నపూర్ణమ్మ ఊహించని విధంగా ఒకరోజు విజయ స్వయంగా తనకు సినిమాల్లో నటించాలని ఉందనే కోరికను పెంపుడుతల్లి దగ్గర వ్యక్తం చేసింది. దాంతో తన పని ఈజీ అయినట్లు ఆనందించింది అన్నపూర్ణమ్మ. ఆ ఇద్దరూ కూడబలుక్కొని విజయ కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఏలూరులో మద్రాస్ మెయిల్ ఎక్కారు. మద్రాస్ వెళ్లాక ఎలాగో తంటాలుపడి జూనియర్ ఆర్టిస్టులా కొన్ని సినిమాలు చేసింది విజయ.
ఆమె రూపం తమిళ దర్శకుడు విను చక్రవర్తిని ఆకర్షించింది. భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకొనే తార అవుతుందని ఆయన ఊహించాడు. ఆయన భార్య కూడా ఆర్టిస్టే. విజయకు నటనలోని మెళకువలు నేర్పింది ఆమే. వారి సహకారంతో 1979లో 'ఇనయేటేడి' అనే మలయాళం సినిమాలో జనాల దృష్టిని ఆకట్టుకొనే క్యాబరే డాన్సర్ కేరక్టర్ చేసింది. ఆమె వంపుసొంపులు, కైపు కళ్లకు ప్రేక్షకులు చిత్తయిపోయారు. మలయాళంలో వరుసగా ఆఫర్లు వచ్చాయి.